గోదావరి నదిలో స్నానానికి దిగిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు నీటిలో గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని కాచిగూడ చెప్పుల బజార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు చంద్రశేఖర్, రాంచందర్, మల్లేష్ కుటుంబ సభ్యులతో కలిసి బాసరలోని జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు.
గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీరు నదిలోకి దిగారు. అయితే, ప్రమాదవశాత్తు ముగ్గురూ లోతైన ప్రాంతంలోకి వెళ్లడంతో నీటిలో గల్లంతయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
