రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) మోహన్ నాయక్ అక్రమ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న విశ్వసనీయ సమాచారం మేరకు, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. మంగళవారం ఉదయం నుంచే హైదరాబాద్, మాదాపూర్‌తో పాటు నిజామాబాద్ జిల్లాలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.అలాగే ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు.ఇందుకు 12 ప్రత్యేక బృందాలను ఏసీబీ రంగంలోకి దించింది.
మోహన్ నాయక్ స్వస్థలమైన నిజామాబాద్ జిల్లాలోరెండు ప్రత్యేక బృందాలు ఉదయం నుంచే మోహరించి, కీలక పత్రాలను పరిశీలిస్తున్నాయి. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామం, అలాగే మక్లూర్ మండలంలో ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు.
ప్రాథమిక విచారణలో భాగంగా మోహన్ నాయక్ పేరుతో వందల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. నివాసాల్లో సోదాలు కొనసాగుతుండటంతో, మరిన్ని కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సోదాలు ముగిసిన తర్వాతే మొత్తం ఆస్తుల విలువ ఎంత అనేది స్పష్టం కానుంది.
