HomeCRIMEవిద్యుత్తు శాఖ నిర్లక్ష్యం.. రైతులకు మృత్యుపాశాలు! ప్రమాదపుటంచున రైతుల ప్రాణాలు..వేలాడుతన్న 11 కేవీ తీగలు.. స్పందించని...

విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం.. రైతులకు మృత్యుపాశాలు! ప్రమాదపుటంచున రైతుల ప్రాణాలు..వేలాడుతన్న 11 కేవీ తీగలు.. స్పందించని అధికారుల నిర్వాకం

అందరికీ వెలుగులు పంచాల్సిన విద్యుత్ శాఖ.. బాధ్యతారాహిత్యంతో అంధకారంలోకి నెట్టడమే కాకుండా, సిర్పూర్ గ్రామ రైతుల పాలిట మృత్యుపాశాలుగా మారుతోంది. వ్యవస్థను నడపాల్సిన అధికారులు కళ్లున్నా చూడనట్లు, చెవులున్నా విననట్లు వ్యవహరిస్తుండటంతో, విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతూ మరణశాసనంలా కనిపిస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ పొలాల మధ్య వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ల తీగలు అత్యంత ప్రమాదకరంగా కిందకు వేలాడుతున్నాయి. చేతికి అందేంత ఎత్తులో తీగలు ఉండటంతో, నిత్యం పొలాల బాట పట్టే రైతులు, పశువుల కాపరులు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరుగుతున్నారు.

విద్యుత్ స్తంభాలు వంగిపోయి, రక్షణ లేని ట్రాన్స్‌ఫార్మర్లు దర్శనమిస్తున్నా, ఏ ఒక్క అధికారికి కనీసం పట్టింపు లేకపోవడం గమనార్హం. సమస్య తీవ్రతను వివరిస్తూ స్థానిక లైన్‌మెన్‌లకు, ఏఈలకు రైతులు పలుమార్లు మొరపెట్టుకున్నారు.

కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలించే ఓపిక కూడా అధికారులకు లేకపోవడం సిగ్గుచేటని గ్రామస్తులు మండిపడుతున్నారు. వందల సార్లు ఫిర్యాదు చేసినా, సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడకపోవడంపై అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వర్షాకాలం సమీపిస్తోంది.

నాట్లు వేసేందుకు పొలాల్లోకి దిగే రైతులు ఈ వేలాడుతున్న తీగల కింద నుంచే పనులు చేసుకోవాలి. వర్షం పడితే విద్యుత్ తీగల నుంచి వచ్చే ముప్పు రెట్టింపు అవుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణనష్టం తప్పదని తెలిసినా, సంబంధిత అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాక స్పందించడం కంటే, ఇప్పటికైనా యుద్ధప్రాతిపదికన తీగలను సరిచేసి, అధికారుల బాధ్యతను నిరూపించుకోవాలని సిర్పూర్ రైతులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments