పెరిగిన పోలింగ్.. ముంచేది ఎవరిని? గట్టెక్కించేది ఎవరిని?- పోలింగ్ ముగిసింది… ఇక రిజల్టే మిగిలింది- గెలుపు పై ఆశాభావంతో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు- కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీగా కొనసాగిన త్రిముఖ పోరు- ప్రధానంగా బిజెపి – కాంగ్రెస్ ల మధ్య గెలుపు పై ఉత్కంఠజాన రమేష్ : ఇది సంగతి ; ఆర్మూర్:
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి.
నిజామబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి, ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి కొన్ని నియోజకవర్గాల్లో ప్రధానంగా పోటీ నెలకొనగా, కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అధికారాన్ని కోల్పోయిన టిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ బిజెపిల మధ్య పోరు కొనసాగింది.
ఈసారి ఎన్నికలు ఈ మూడు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. అయితే గతంలో కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదు కావడంతో పెరిగిన పోలింగ్ ఎవరిని గట్టు ఎక్కిస్తుంది? ఎవరిని ముంచుతుంది ? అనే చర్చ సర్వాత్ర కొనసాగుతోంది.నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ పరిధిలో 68.37% పోలింగ్ నమోదయింది. ఇదిలా ఉండగా ఐదు నెలల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 74.13% పోలింగ్ నమోదయింది. ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 71.47% పోలింగ్ నమోదైనట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడించారు.
పెరిగిన పోలింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూరుస్తుంది. ఎవరిని ఓడిస్తుంది అనే చర్చ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో జోరుగా కొనసాగుతుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి బిజెపి- కాంగ్రెస్ అభ్యర్థులు తమ సాధించే ఓట్లపై ఎవరి ధీమాలో వారు ఉన్నారు.
ఎవరి అంచనాల్లో వారు తల మునకలయ్యారు. గెలుపు పై జాతీయ పార్టీల అభ్యర్థులైన ధర్మపురి అరవింద్, తాడిపత్రి జీవన్ రెడ్డిలు ఆశాభావంతో ఉన్నారు. అయితే అభ్యర్థుల భవితవ్యం మాత్రం బాక్సుల్లో భద్రంగా ఉంది. ఓటరు దేవుళ్ళు ఎవరికి పట్టం కట్టారో ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే!