HomeTelanganaNizamabadనిజామాబాద్ అభివృద్ధే నా మొదటి ప్రాధాన్యత..అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ- ప్రత్యేక నిధుల కేటాయింపులో ప్రభుత్వ...

నిజామాబాద్ అభివృద్ధే నా మొదటి ప్రాధాన్యత..అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ- ప్రత్యేక నిధుల కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం- ఐటీ హబ్, జీజీహెచ్ ఆధునీకరణ, రోడ్ల అభివృద్ధి కోసం మంత్రులకు విజ్ఞప్తి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక నిధులు కేటాయించలేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ మేయర్ ఉన్నప్పటికీ అభివృద్ధి నిధులు మాత్రం అందడం లేదని ఆయన విమర్శించారు. ​మేయర్‌కు రాజకీయ అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, మున్సిపల్ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే కోరారు.

సీడీఎఫ్ నిధులతో పాటు ప్రత్యేక నిధులను కూడా వెంటనే విడుదల చేసి నిజామాబాద్ అభివృద్ధికి సహకరించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అయితే జిల్లా అభివృద్ధి విషయంలో ఇప్పటికే పలువురు మంత్రులను కలిసి వినతిపత్రాలు అందజేశానని అన్నారు.

అవసరమైతే మరెన్నిసార్లైనా మంత్రులను కలిసి జిల్లా ఇందూరు అభివృద్ధి కోసం విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎల్లమ్మగుట్ట సోనీ ఫంక్షన్ హాల్ విద్యుత్ కనెక్షన్ సమస్యపై తాను ప్రత్యేకంగా కృషి చేశానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ సమస్య త్వరలోనే పూర్తిగా పరిష్కారమవుతుందని వెల్లడించారు.కాలానికి అనుగుణంగా నిజామాబాద్ నగరం విస్తరిస్తుండటంతో ట్రాఫిక్ ప్రధాన సమస్యగా మారిందని, దేవి రోడ్డు – నాందేవ్ వాడ మధ్యలో 30 సంవత్సరాల క్రితం నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ విస్తరణకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు.

​ కంటేశ్వర్ నుంచి వినాయక్ నగర్ వరకు కనెక్టివిటీ బైపాస్ రోడ్డు కోసం 30 కోట్లు, శివాజీ నగర్ నుంచి మొదక్‌పల్లి ఆర్ అండ్ బి రహదారికి నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే కమ్మరపల్లి నుంచి వర్ని వైపు సాగే 107 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రతిపాదనలపై చర్చించామన్నారు.

జిల్లాకు పరిశ్రమలు రావాలంటే ముందుగా మెరుగైన కనెక్టివిటీ రోడ్లు ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ తరహాలోనే నిజామాబాద్‌లోనూ ఐటీ హబ్‌ను తీర్చిదిద్దాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా, స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించేలా ఈ ప్రతిపాదన చేసినట్లు చెప్పారు.


జీజీహెచ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి
​నగరంతో పాటు జిల్లా ప్రజలకు అత్యవసరంగా సేవలందిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో దాదాపు 50 శాతం సమయం జీజీహెచ్ సమస్యలపైనే చర్చించినట్లు తెలిపారు.

​నిత్యం సుమారు 2,000 మంది ఓపీ రోగులు, 100 మందికి పైగా ఇన్ పేషెంట్లు వస్తున్న ఈ ఆసుపత్రిలో తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని చెప్పారు. ​మెరుగైన వైద్యం కోసం ఎంఆర్ఐ, స్కాన్ సేవలు, మార్చురీలో కొత్త ఫ్రీజర్లు, నూతన ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ​

క్యాజువాలిటీలో ఆర్ఎంఓల కొరత తీవ్రంగా ఉండటంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లతో నెట్టుకొస్తున్నామని, ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహను కోరగా.. ఆయన స్పందిస్తూ ఎండీతో మాట్లాడి పూర్తి నివేదిక తెప్పించుకుంటానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆరోగ్యం విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.


ప్రయాణికుల సౌకర్యార్థం బస్ స్టాండ్ అభివృద్ధికి కృషి
​వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే నిజామాబాద్ బస్ స్టాండ్ అత్యంత అధ్వానంగా తయారైందని, కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ముఖ్యంగా మహిళలకు రక్షణ కరవైందని, సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలు, మెరుగైన లైటింగ్, పార్కింగ్, వెయిటింగ్ హాల్ వంటి వసతులు కల్పించాలని విన్నవించినట్లు చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి
​జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఎంపీ అర్వింద్‌తో కలిసి సంయుక్తంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

ఇందులో భాగంగానే ఎంపీతో కలిసి రైల్వే మంత్రిని కలవడం జరిగిందని, జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఆర్ అండ్ బి, ఆర్ఓబీ పనులను త్వరగా పూర్తి చేయించేందుకు తమ వంతు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్ చింత శ్రీనివాస్, సత్యపాల్, శశాంక్,నాగోల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments