హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద శనివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కారు పూజ కోసం ఆలయానికి వచ్చిన 70 ఏళ్ల వృద్ధుడు అదే కారు కింద పడి మృతి చెందారు. మృతుడి మేనల్లుడి కొత్త కారు పూజ కార్యక్రమం కోసం రామచంద్రరావు (70) బంధువులతో కలిసి పెద్దమ్మ గుడికి వచ్చారు.
పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత కారును అక్కడి నుంచి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పొరపాటున యాక్సిలరేటర్‌ను తొక్కడంతో వాహనం ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. కారు ముందు భాగంలో ఉన్న వృద్ధుడు మీదికి దూసుకెళ్లింది .
తీవ్ర గాయాలపాలైన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే మృతి చెందారు . ఆలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంతో అక్కడ విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
