ఫార్ములా ఈ రేస్ ఒక బేఖారు కేసు అని, కేటీఆర్ ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక అవినీతి అంటూ ఇది కాంగ్రెస్ లేపిన పుకారు అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు.
శుక్రవారం నగరంలోని జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫార్ములా ఈ రేస్ కేసు పేరుకేనని, అసలు కాంగ్రెస్, బీజేపీల టార్గెట్ బీఆర్ఎస్ “కారు“ అని ఆయన అన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు సంయుక్తంగా సమర్పిస్తున్న ’ఫార్ములా ఈ రేస్ ’ అనే అభూత కల్పిత సీరియల్ నుసృష్టించారని ఆయన చెప్పారు. ఈ కుట్రలో పాత్రధారులు,సూత్రధారులు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీఎం రమేష్ లని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్ పై కేసుకు తాజాగా గవర్నర్ అనుమతి పేరుతో రాజకీయ తతంగం చేశారని, ఇది కాంగ్రెస్, బీజేపీల మాయాజాలమని ఆయన పేర్కొంటూ గవర్నర్ ఎన్ని సార్లు అనుమతి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రజలకు ఉపయోగపడే బిల్లులు ఆమోదించడానికి మనసురాని గవర్నర్లు బీజేపీ పెద్దల ఆదేశాలు పాటిస్తూ రాజకీయ ప్రత్యర్ధులను అణచి వేసే కేసులకు మాత్రం ఆగ మేఘాల మీద అనుమతులు ఇస్తున్నారని విమర్శించారు.
కేటీఆర్ పై కేసు విషయంలో కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధం మరోమారు బయటపడిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసు నమోదు చేసిందన్నారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా మిగిలిపోతారని, ఇక భవిష్యత్తులో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో గెలిచే అవకాశమే లేదని జీవన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా కేటీఆర్ కడిగిన ముత్యంలా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతారని ఆయన తెలిపారు.
ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని, సర్కార్ దాష్టీకాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేదాకా పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
ఐటీ ,మున్సిపల్ ,ఇండస్ట్రీ మంత్రిగా కే టీ ఆర్ తెలంగాణ ను అగ్రభాగాన నిలబెట్టారన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడానికి ,దేశ జీడీపీ లో తెలంగాణ వాటా పెరగడానికి కేటీఆర్ యే కారణమన్నారు.కే టీ ఆర్ జీడీపీ పెంచితే రేవంత్ గుండాయిజం పెంచారని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ తలసరి ఆదాయం పెంచితే రేవంత్ తన సొంత ఆదాయం పెంచుకున్నారన్నారు.ఫార్ములా వన్ లో కే టీ ఆర్ జైలుకు పోతే ఎందరో సీఎం లు జైలు కు పోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, సీనియర్ నాయకులు ప్రభాకర్,సత్య ప్రకాష్,సుజిత్ సింగ్ ఠాకూర్,దండు శేఖర్,పోల సుధాకర్,మెట్టు సంతోష్,అభిలాష్,సురేష్,రమేష్,సయ్యద్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.
