జిల్లాలో గత రెండు రోజులుగా చైన్ స్నాచర్లు పడగవిప్పారు. వరుస దొంగతనాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్న దుండగులు.. పోలీసు యంత్రాంగానికి బహిరంగ సవాల్ విసురుతున్నారు. పక్కా స్కెచ్‌తో రెచ్చిపోతున్న ముఠాల కదలికలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.శుక్రవారం సాయంత్రం మాక్లూర్ మండలంలో స్నాచర్లు తమ చేతివాటం ప్రదర్శించారు.
రామచంద్రపల్లి చౌరస్తా వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను అడ్డుకున్న ఇద్దరు అపరిచిత వ్యక్తులు, యాక్టివాపై వచ్చి కనురెప్పపాటులో మహిళ మెడలోని రెండు తులాల బంగారు గొలుసును తెంపుకొని పరారయ్యారు. బాధితులు తేరుకునేలోపే దుండగులు వేగంగా పారిపోయారు.
మాక్లూర్ ఘటనకు ముందే నగరంలోని మూడు మరియు నాలుగో టౌన్ పరిధిలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడగా, ఒక చోట బాధితులు అప్రమత్తం కావడంతో దొంగల ప్రయత్నం విఫలమైంది. ఒకవైపు రహదారులపై గొలుసు దొంగతనాలతో హడలెత్తిస్తుంటే, మరోవైపు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు విరుచుకుపడుతున్నారు.
3వ టౌన్ పరిధిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడి పరారయ్యారు. విచ్చలవిడిగా చైన్ స్నాచింగ్లు,దొంగతనాలు జరుగుతుంటే వారిని పట్టుకోవడంలో పోలీ సులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రాత్రుల్లో పెట్రోలింగ్ సక్రమంగా చేయ కపోవడం, మధ్యాహ్నం పట్టణాల్లో నిఘా లేకపోవడం మూలంగా దొంగత నాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా పోలీసులు ఇతర పనుల్లో బిజీగా ఉండడం కూడా దోపిడీ దొంగలకు కలిసి వస్తోంది.
జిల్లాలోని మహిళలు దారి వెంట వెళ్లాలన్నా, ఉదయమే ఇంటి ముందు అలుకు చల్లి ముగ్గులు వేయా లన్నా జంకుతున్నారు. చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారన్న వార్తలు దావనంలా వ్యాపించడంతో మహిళలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వరుస సంఘటనలపై జిల్లా పోలీస్ కమిషనర్ స్పందించారు. సీపీ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. జిల్లా సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేయడంతో పాటు, ఘటనా స్థలాల్లోని సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, అనుమానిత ముఠాల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అర్ధరాత్రి ఏసీపీ పెట్రోలింగ్.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిజామాబాద్ డివిజన్ ఏసీపీ ప్రకాష్ స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించారు.
శుక్రవారం రాత్రి ఆయన తన సిబ్బందితో కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రోడ్లపై అనుమానాస్పదంగా కనిపిస్తున్న వారిని నిలదీసి వివరాలు సేకరించారు.
