నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల సారంగాపూర్ ప్రాంతంలో జోరుగా సాగుతున్న పేకాట స్థావరంపై చీతా ఫోర్స్ సిబ్బంది శనివారం మెరుపు దాడి నిర్వహించారు.
జిల్లా జైలు పక్కనే బహిరంగంగా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు రంగులరాట్నంగా పట్టుకున్నారు.పోలీసుల కథనం ప్రకారం… కమిషనరేట్ పరిధిలో అక్రమ కార్యకలాపాలపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (ఐపీఎస్) ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సి.సి.ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పర్యవేక్షణలో చీతా ఫోర్స్ సిబ్బందికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సారంగాపూర్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ గుంపుగా చేరి పేకాట ఆడుతున్న ఐదుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ దాడిలో నిందితుల నుంచి రూ. 12,530 నగదుతో పాటు 3 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు.
కమిషనరేట్ పరిధిలో పేకాట, గుట్కా, గంజాయి, డ్రగ్స్ వంటి ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు.
ప్రజల పరిసరాల్లో ఎక్కడైనా ఇలాంటి అనుమానాస్పద, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా పోలీస్ శాఖ కోరింది.
