24 గంటల పోలీసుసేవల కోసం ఇంతకాలం సేవలందించిన డయల్ 100 స్తానంలో మరో ఆధునిక సాంకేతిక వ్యవస్థను పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చింది.ఆపద లో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడానికి ఈ వ్యవస్థ ను మరింత పటిష్టంగా మెరుగా రూపొందించారు.ఆపద లో ఉన్న వారు ఇదివరకు 100 కాల్ చేస్తే ఇక మీద 112 కు కాల్ చెయ్యాలి
ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. రోడ్డు ప్రమాదం కావచ్చు… అగ్నిప్రమాదం కావచ్చు… మహిళపై దాడి, చిన్నారి ప్రమాదంలో చిక్కుకోవడం, ప్రకృతి విపత్తు, వైద్య అత్యవసర పరిస్థితి… ఇలాంటి సమయంలో క్షణాల వ్యవధే ప్రాణాలను కాపాడుతుంది.
అలాంటి సమయంలో ప్రజలకు ఒకే నంబర్‌తో అన్ని అత్యవసర సేవలను చేరవేసేలా తెలంగాణ ప్రభుత్వం ‘నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఆధారిత డయల్-112’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం పోలీసింగ్‌లో కీలక సంస్కరణగా చెప్పవచ్చు. ఒకప్పుడు అత్యవసర పరిస్థితి అంటే పోలీసులకు 100, అగ్నిమాపక శాఖకు 101, అంబులెన్స్‌కు 108, మహిళల భద్రతకు వేర్వేరు హెల్ప్‌లైన్ నంబర్లు గుర్తుంచుకోవాల్సి వచ్చేది.
ఇప్పుడు ఆ పరిస్థితికి పూర్తిగా తెరపడింది. ఇకపై ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా ఒకే నంబర్ – 112కు కాల్ చేస్తే చాలు. పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళల రక్షణ, శిశు సంక్షేమం, విపత్తు నిర్వహణ వంటి సేవలు ఒకే వేదికపై అందుబాటులోకి వచ్చాయి.దీన్ని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఈ సేవలను ప్రారంభించిన డీజీపీ సి.వి. ఆనంద్ సాంకేతికతను ప్రజా భద్రతకు మరింత చేరువ చేశారు.
112 అనేది దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఏకీకృత జాతీయ అత్యవసర సేవల నంబర్. ఒకే కాల్‌తో అవసరాన్ని బట్టి సంబంధిత శాఖకు సమాచారం చేరుతుంది.
కాల్ చేసిన వ్యక్తి పోలీసు సహాయం కోరినా, అంబులెన్స్ అవసరమైనా, అగ్నిప్రమాదం జరిగినా, మహిళలపై దాడి జరిగినా లేదా ప్రకృతి విపత్తు సంభవించినా… అన్నింటికీ ఒకే నంబర్ స్పందిస్తుంది.
ఏయే సేవలు అందుబాటులో ఉంటాయి..?
పోలీసు సహాయం,అగ్నిమాపక సేవలు,అంబులెన్స్ సేవలు,మహిళల రక్షణ,శిశు సంక్షేమ అత్యవసర సేవలు,విపత్తు నిర్వహణ,ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు,దోపిడీలు, దాడులు, గొడవలు,ప్రకృతి విపత్తులు, వరదలు, అగ్నిప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితులు ఇలా అన్ని సేవలు ఒకే వేదికపై అందుబాటులో ఉంటాయి.
కొత్త వ్యవస్థలో అత్యంత కీలకమైన అంశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాల్ వచ్చిన వెంటనే ఏఐ దాని స్వభావాన్ని గుర్తించి అత్యవసరతను అంచనా వేస్తుంది. స్పామ్, సైలెంట్, అనవసర కాల్స్‌ను ముందుగానే వడపోసి అసలైన అత్యవసర కాల్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది.
కాల్ మాట్లాడిన సమాచారాన్ని వెంటనే వాయిస్-టు-టెక్స్ట్ రూపంలో మార్చి, సంబంధిత విభాగానికి పంపిస్తుంది. కాలర్ లొకేషన్‌ను ఎల్ బిఎస్, ఏఎల్ఎస్, గూగుల్ మ్యాప్స్ ఆధారంగా 94 శాతం ఖచ్చితత్వంతో గుర్తించి సమీపంలోని పోలీసు వాహనం లేదా అత్యవసర బృందాన్ని ఆటోమేటిక్‌గా పంపిస్తుంది.
అయితే ఈ కేంద్రం 24 గంటలూ, 365 రోజులూ పనిచేస్తుంది. శిక్షణ పొందిన 164 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారు. ప్రతి రోజు లక్షల కాల్స్ ఐవిఆర్ కు చేరుతుండగా, వేలాది అత్యవసర కాల్స్‌ను నిపుణులు స్వీకరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1,860 పెట్రోలింగ్ వాహనాలు ఈ వ్యవస్థతో అనుసంధానమై ఉంటాయి. సంఘటన జరిగిన ప్రదేశానికి అత్యంత సమీపంలో ఉన్న వాహనాన్నే సిస్టమ్ ఎంపిక చేసి పంపిస్తుంది.
ఈ వ్యవస్థతో కాల్ స్వీకరణ నుంచి స్పందన వరకు సమయం గణనీయంగా తగ్గింది. గతంలో సుమారు మూడు నిమిషాలు పట్టే కాల్ ప్రాసెసింగ్ ఇప్పుడు 133 సెకన్లకే పూర్తవుతోంది. రాష్ట్ర సగటు స్పందన సమయం 10 నిమిషాల 30 సెకన్లుగా నమోదై, దేశ సగటు కంటే మెరుగ్గా నిలిచింది. పట్టణాల్లో సగటున ఆరు నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 15 నిమిషాల్లో సహాయక బృందాలు సంఘటన స్థలానికి చేరుతున్నాయి.
అత్యవసర పరిస్థితుల్లో ఇకపై వేర్వేరు నంబర్లు వెతకాల్సిన అవసరం లేదు. “ఒకే దేశం – ఒకే అత్యవసర నంబర్ – 112” అనే భావనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థను రూపొందించాయి. ప్రజలు 112ను గుర్తుంచుకుని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వినియోగిస్తే ఈ సేవల అసలు లక్ష్యం నెరవేరుతుంది.
