HomeHEALTHనవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు! వైద్య కళాశాల ఘనత మాదేనని చెప్పుకునే నేతలు.. మార్చరీలో పనిచేయని...

నవ్విపోదురు గాక.. నాకేంటి సిగ్గు! వైద్య కళాశాల ఘనత మాదేనని చెప్పుకునే నేతలు.. మార్చరీలో పనిచేయని ఫ్రీజర్లపై ఎందుకు మౌనం? మార్చరీలో మూడు ఫ్రీజర్లు.. ఒక్కటీ పనిచేయదు!

ఎన్ని ఫిర్యాదులు చేసినా.. నివేదికలు పంపినా పట్టించుకోని అధికారులురోజూ వేలాది మంది రోగులకు వైద్య సేవలు అందించాల్సిన జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి.. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా మారుతోంది. ప్రాణాలతో ఉన్న రోగులకు వైద్యం ఎలా అందుతోందన్నది ఒక ఎత్తయితే.. ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు కనీస గౌరవం దక్కని దుస్థితి మరో ఎత్తు.

మృతదేహాలను భద్రపరిచేందుకు అవసరమైన ఫ్రీజర్లు సైతం అందుబాటులో లేక శవాలు కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతున్నా సంబంధిత అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.జిల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో, జిల్లా రాజకీయాల్లో కీలక నేతలు.. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అభివృద్ధిపై మాట్లాడుతుంటారు.

వైద్య కళాశాల తమ కృషితోనే వచ్చిందంటూ గొప్పలు చెప్పుకునే నాయకులు సైతం.. అదే ప్రభుత్వ ఆసుపత్రిలో శవాలను భద్రపరిచే ఫ్రీజర్లు లేవని సోయి లేదు. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి అభివృద్ధికి తామే కారణమంటూ గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులు జిల్లాలో ఉన్నారు.

అధికార పార్టీకి చెందిన కీలక నేతలు అప్పుడప్పుడు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. కానీ మార్చరీలో మూడు ఫ్రీజర్లు పనిచేయకపోవడం, మృతదేహాలు కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటం వంటి కనీస మౌలిక సదుపాయాల సమస్యలపై మాత్రం శాశ్వత చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫ్రీజర్లు వంటి కనీస సదుపాయాలు సమకూర్చడం పెద్ద విషయం కాకపోయినా.. వాటిని కూడా అందుబాటులోకి తేలేని పరిస్థితి నెలకొంది.ఆసుపత్రికి వచ్చి పరిశీలించడం.. అధికారులను ఆదేశించడం.. సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం వరకే పరిమితమవుతున్న వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గతంలోనూ ఆసుపత్రిలో మృతదేహాలు కుళ్లిపోతున్న దుస్థితిపై కథనం వెలువడినా.. పరిస్థితిలో పెద్దగా మార్పు లేకపోవడం అధికార యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోంది.ఫ్రీజర్లు పనిచేయడం లేదని ఆసుపత్రి సిబ్బంది పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

నివేదికలు, ఫిర్యాదులు పంపినా ఇప్పటివరకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు ఫ్రీజర్లు ఉండి.. కనీసం ఒక్కటి కూడా పనిచేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారింది.

రోగులకు వైద్యం అందించే ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నా.. ఇలాంటి కీలక సమస్యల పరిష్కారంలో మాత్రం చొరవ కనిపించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఫ్రీజర్లతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రోగుల బంధువులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments