ఆస్పత్రికి సమీపంలోనే మెకానిక్ షాపులో పనిచేస్తున్న నిందితుడుఆ మెకానిక్ షాపు వెనకే ఆస్పత్రి నర్సింగ్ సిబ్బందికి విశ్రాంతి గదులుశుక్రవారం రాత్రి గదిలో ఒంటరిగా ఉన్న నర్సుపై దారుణంమొదట అనుమానాస్పద మృతిగా కేసు.. దర్యాప్తులో విషయం వెల్లడికిటికీలకు గ్రిల్స్ లేకపోవడంతో సులువుగా గదిలోకి వెళ్లిన నిందితుడు
హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక నర్సు దారుణ హత్యకు గురయ్యారు. తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు శుక్రవారం రాత్రి తన విశ్రాంతి గదిలో హత్యకు గురయ్యారు.
మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆమెను ప్రైమ్‌కేర్ ఆస్పత్రి సమీపంలోని ఒక మెకానిక్ షాపులో మెకానిక్‌గా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సైనా ఉల్లా దారుణంగా హత్యచేసినట్లు గుర్తించారు. ఆదివారం అతడిని అరెస్టు చేశారు. హత్య జరిగిన తీరును పోలీసువర్గాలు వెల్లడించాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన మృతురాలు ఈఏడాది జనవరిలో తుక్కుగూడలోని ప్రైమ్‌కేర్ ఆస్పత్రిలో నర్సుగా చేరింది. ఇక్కడ పనిచేసే నర్సుల కోసం ఆస్పత్రికి కొద్దిదూరంలో యాజమాన్యం విశ్రాంతి గదులను ఏర్పాటు చేసింది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకున్న ఆమె.. తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకుంటోంది.
ఆ గదిలో మృతురాలితోపాటు మరో నర్సు కూడా ఉంటుండగా.. ఆమె ఆ సమయంలో విధుల్లో ఉంది. మిగతా గదుల్లోనూ ఎవరూ లేరు. అది గమనించిన నిందితుడు.. కిటికీ ద్వారా గదిలోకి ప్రవేశించాడు. మృతురాలు గమనించేలోపే ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. భయకంపితురాలైన ఆమె కేకలు వేస్తూ ప్రతిఘటించటంతో సైనా ఉల్లా.. ఆమె గొంతు నులిమి దారుణంగా హత్యచేశాడు.
శనివారం మరో నర్సు సారిక వచ్చి గది తలుపు తట్టగా తీయకపోవడంతో ఆస్పత్రి యాజమాన్యానికి విషయం చెప్పింది. పోలీసులు గది కిటికీ ద్వారా లోపలికి వెళ్లి చూడగా ఆమె విగతజీవిగా కనిపించింది.
ఆమె ముఖం, కాళ్లపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.హత్య తర్వాత అత్యాచారం?నర్సును దారుణంగా హత్యచేసిన సైనా ఉల్లా.. ఆ తర్వాత మరింత ఘోరానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలకుండా మృతదేహంపై అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
అయితే, పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని ఒక పోలీసు అధికారి తెలిపారు. రెండేళ్ల క్రితం కోల్‌కతాలోని ఆర్జీఖర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో పీజీ విద్యార్థి హత్య తరహాలోనే ఈ ఘటన కూడా ఉందని పోలీసులు తెలిపారు.
2024 ఆగస్టు 10న రాత్రి ఆర్జీఖర్ ఆస్ప్రతిలో డ్యూటీ ముగించుకొని తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆ విద్యార్థినిపై సంజయ్‌రాజ్ అనే వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో దారుణంగా కొట్టి చంపి.. ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.
