- మృతులంతా బీహార్‌కు చెందిన కార్మికులు
- రైస్ మిల్లులో హమాలీలుగా జీవనం..
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు వలస కూలీల ప్రాణాలను బలితీసుకుంది. రాంపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో బైకుపై ఉన్న ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు,స్థానికుల కథనం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ముకియ, రాహుల్, హంసారి అనే ముగ్గురు కార్మికులు స్థానిక భవన రైస్ మిల్లులో హమాలీలుగా పనిచేస్తున్నారు. రాత్రి సమయంలో పని ముగించుకుని గాంధారి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రాంపూర్ శివారులోకి రాగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పింది. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. తీవ్ర గాయాలవడంతో ముగ్గురూ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. బతుకుదెరువు కోసం వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ కూలీ పనులు చేసుకుంటున్న వలస జీవుల మృతితో తోటి కార్మికుల్లో విషాదం నిండింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
