యువతే దేశానికి వెన్నెముక.. వారు సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుంది” అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు.
ఆదివారం నిజామాబాద్ రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో ‘మత్తు పదార్థాలకు దూరం-జీవితానికి చేరువ’అనే నినాదంతో నిర్వహించిన 2కే రన్ విద్యార్థుల కేరింతలు, యువత ఉత్సాహం మధ్య కోలాహలంగా సాగింది.
నగరంలోని బైపాస్ చౌరస్తా వద్ద సీపీ జెండా ఊపి ఈ పరుగును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీపీ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో యువత పెడదోవ పడుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు లోనైతే జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని హెచ్చరించారు.
మానసిక ఒత్తిడికి లోనై తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దని, క్రీడలు, వ్యాయామం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని, సమాచారం తెలిస్తే 1908 లేదా 100 నంబర్లకు ఫిర్యాదు చేయాలని కోరారు. సమాజాన్ని మత్తు రహితంగా మార్చేందుకు మీడియా, ప్రజలు సహకరించాలన్నారు.
కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నాటికలు ఆలోచింపజేశాయి. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం బైపాస్ చౌరస్తా నుంచి ఐడీఓసీ కార్యాలయం వరకు 2కే రన్ నిర్వహించారు. పరుగులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సీపీ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి.బస్వా రెడ్డి, ఏసీపీలు ప్రకాష్, మస్తాన్ అలీ, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు షరీఫ్, ఆనంద్ సాగర్, పోలీస్ సిబ్బందితో పాటు గిరిరాజ్, సీఎస్ఐ, డైట్ కళాశాలలు, వివేకానంద పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
