Sunday, March 29, 2026
HomeLaw and Orderహనుమాన్‌ జయంతి వేళ ఆంక్షలు కఠినం..కమిషనరేట్‌ పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేసిన సీపీ..డీజేలు, బైక్‌ ర్యాలీలపై...

హనుమాన్‌ జయంతి వేళ ఆంక్షలు కఠినం..కమిషనరేట్‌ పరిధిలో నిషేధాజ్ఞలు జారీ చేసిన సీపీ..డీజేలు, బైక్‌ ర్యాలీలపై నిషేధం.. ఉల్లంఘిస్తే చర్యలు

రానున్న హనుమాన్‌ జయంతి పండుగను పురస్కరించుకుని జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు జాగ్రత్తగా నిజామాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు సీపీ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌ హోదాలో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఎలాంటి బహిరంగ సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదు. మతపరమైన విద్వేషాలు రేకెత్తించే ప్రసంగాలు, సంజ్ఞలు, చిత్రాలు లేదా చిహ్నాలను ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుంది.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం, మత్తు పదార్థాల సేవనం, టపాకాయలు కాల్చడం నిషిద్ధం. ఊరేగింపుల్లో అధిక శబ్దం వెలువరించే డీజేలు, సౌండ్‌ మిక్సర్ల వాడకాన్ని అనుమతించరు. బైక్‌ ర్యాలీలు, సైలెన్సర్లను మార్చి అధిక శబ్దాలు చేసే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటారు.ఇతర వర్గాలను కించపరిచేలా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదు. జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ల వినియోగంపై నిషేధం ఉంటుంది.

మంటలు పుట్టించే పదార్థాలు, ఆయుధాలు వెంట తీసుకెళ్లడం నేరం అని తెలిపారు. ఈ నిబంధనలు పక్కా పాటించాలని సూచించారు. ఈ ఉత్తర్వుల నుంచి విధుల్లో ఉన్న పోలీసులు, మిలిటరీ, పారా మిలిటరీ సిబ్బంది, హోంగార్డులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు.

నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులు లేదా సంస్థలపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్‌ 223తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!