రైల్వే వంతెన విస్తరణ పనుల నేపథ్యంలో నిర్ణయం కంటేశ్వర్ పాలిటెక్నిక్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు మార్పులు ఆదివారం ప్రయోగాత్మకంగా పరిశీలించిన పోలీసులునగరంలోని రద్దీ ప్రాంతాల్లో ఒకటైన రైల్వే కామన్ వంతెన విస్తరణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా వంతెన వెడల్పు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతుండటంతో, వాహనదారుల ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
ఇందులో భాగంగా కంటేశ్వర్ పాలిటెక్నిక్ కళాశాల నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు మార్గాన్ని వన్‌వేగా మారుస్తూ ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. వంతెన పనులు ప్రారంభమైతే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో, ఆదివారం ట్రాఫిక్ సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాత్మక పరిశీలన చేపట్టారు.
వన్‌వే అమలు చేయడం వల్ల వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ ఒత్తిడి వంటి అంశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పనుల సమయంలో ఎక్కడా ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఆదివారం నిర్వహించిన ట్రయల్ రన్ ఫలితాలను బట్టి, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ వన్‌వే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఒకవేళ ఈ మార్పు విజయవంతమైతే, సుమారు మూడు నెలల పాటు ఇదే విధానం కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
