Saturday, May 2, 2026
HomeCRIMEదొడ్డు వడ్లు కొనాల్సిందే.. రోడ్డెక్కిన అన్నదాత!మోపాల్‌లో రైతుల రాస్తారోకో, మానవహారం స్పందించకుంటే 'చలో కలెక్టరేట్' హెచ్చరిక

దొడ్డు వడ్లు కొనాల్సిందే.. రోడ్డెక్కిన అన్నదాత!మోపాల్‌లో రైతుల రాస్తారోకో, మానవహారం స్పందించకుంటే ‘చలో కలెక్టరేట్’ హెచ్చరిక

“రుతువులు మారుతున్నా.. ప్రభుత్వాలు మారుతున్నా.. రైతు గోస మాత్రం మారడం లేదు” అంటూ నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో అన్నదాతలు కదం తొక్కారు. దొడ్డు రకం ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు రైతులు భారీ ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అనంతరం రహదారిపై మానవహారంగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పంట చేతికొచ్చి 15 నుండి 20 రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 46 డిగ్రీల భానుడి భగభగలకు ఆరబోసిన ధాన్యం ఎండిపోయి తూకంలో భారీగా తగ్గుతోందని, దీనివల్ల తమకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోందని వాపోయారు. ఓ వైపు ఎండలు, మరోవైపు మిల్లుల నిరాకరణతో తాము ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందారు. ఈ నిరసనలో పాల్గొన్న ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, సర్పంచ్ ధ్యాప రవి, అగ్గు చిన్నయ్య మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.యూరియా కొరతతో మొదలైన రైతుల కష్టాలు.. ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల వరకు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం యాప్‌ల సాకు చూపిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం చేతగాక నెపం కేంద్రంపై నెడుతోంది. ఈ రాజకీయ విమర్శల మధ్య రైతు బలైపోతున్నాడు.” అని వారు మండిపడ్డారు.కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, టెంట్లు, తాగునీరు లేక రైతులు అస్వస్థతకు గురవుతున్నారని నేతలు ధ్వజమెత్తారు. ఇదే తరుణంలో రైస్ మిల్లుల యజమానులు, అధికారులు కుమ్మక్కై ‘తరుగు’ పేరుతో క్వింటాలుకు 2 నుంచి 5 కిలోల వరకు కట్ చేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. గన్ని సంచుల కొరత, హమాలీలు, లారీల ఇబ్బందులను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు.క్షేత్రస్థాయిలో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి.తూకం వేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలి. తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలి. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే వేలాది మంది రైతులతో కలిసి చలో కలెక్టరేట్’ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గుడ్డోల్ల గంగాధర్, కెంపు నరేష్, పోతన్న, నారాయణ, బంటు గంగాధర్, మల్లవ్వ, నర్సవ్వ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!