.. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కొరడా ఝుళిపించారు. సోమవారం నిజామాబాద్ బైపాస్ రోడ్డులోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా చాలా మంది ద్విచక్ర వాహనదారులు, ముఖ్యంగా ఉద్యోగులు ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.
చాలా వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకపోవడం, మరికొందరు నంబర్ ప్లేట్లను వంచి కనిపించకుండా చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గమనించారు. నిబంధనలు పాటించని వారిని ఆపి, మొదటిసారి కావడంతో వారికి ట్రాఫిక్ నిబంధనలపై కౌన్సెలింగ్ ఇచ్చారు. పునరావృతం చేయవద్దని హెచ్చరిస్తూ మరికొందరిపై ఈ-పెట్టి కేసులను నమోదు చేశారు.
హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న దాదాపు 50 మంది వాహనదారులను గుర్తించిన అధికారులు, వారికి ట్రాఫిక్ నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.
వాహనదారులు విధిగా ట్రాఫిక్ నియమాలను పాటించాలని, నంబర్ ప్లేట్లు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలని, తలకి హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు ఎంతో ముఖ్యమని పోలీసులు సూచించారు.
భవిష్యత్తులోనూ ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
