చాంచల్‌గూడ నుంచి ఐఎస్ సదన్ వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు..నగరంలో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు, ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.
చాంచల్‌గూడ వై-జంక్షన్ నుంచి ఐఎస్ సదన్ జంక్షన్ వరకు కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను సోమవారం చార్మినార్ జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, అడిషనల్ డీసీపీ రామదాస్ తేజావత్, చార్మినార్ డివిజన్ ఏసీపీ చంద్రకుమార్, సంతోష్‌నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహ్మద్ ఆసిఫ్ తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మాణ పనుల నేపథ్యంలో ప్రజలకు, వాహనదారులకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్లను ఏ విధంగా అమలు చేయాలనే అంశంపై అధికారులు సుదీర్ఘంగా సమీక్షించారు. నిర్మాణ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.
అవసరమైన చోట యూ-టర్న్‌ల ఏర్పాటు, ట్రాఫిక్ రద్దీకి కారణమవుతున్న అనవసరపు యూ-టర్న్‌ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్, ప్రాజెక్ట్స్ విభాగం ఏఈలు, డీఈలతో సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ప్రాజెక్ట్స్ విభాగం ఏఈలు, డీఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
