నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత రెండు వారాల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో 346 మంది పట్టుబడ్డారని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. వీరిని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపర్చగా 29 మందికి వారం రోజుల జైలు శిక్ష విధించగా, మిగిలిన వారికి మొత్తం రూ.32.60 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు.
జూలై 20 నుంచి ఆగస్టు 1 వరకు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అధిక మోతాదులో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పలువురు పట్టుబడినట్లు పేర్కొన్నారు.
పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మద్యం మత్తులో ప్రమాదానికి కారణమైతే బీమా ప్రయోజనాలు కూడా వర్తించవని తెలిపారు.
అలాగే మైనర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కూడా కేసులు నమోదు చేస్తామని, జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఒకటి కంటే ఎక్కువసార్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.
మోటార్ వెహికల్ చట్టం–1988కు 2019లో చేసిన సవరణల ప్రకారం, మొదటిసారి డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశం ఉందని, రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానాతో పాటు మరింత కఠిన చర్యలు ఉంటాయని కమిషనర్ తెలిపారు.
