గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ 100 కోట్లకు పైగా నిధులు తెచ్చి నగర అభివృద్ధి చేస్తున్నట్టు చేసిన ప్రకటనలు పచ్చి అబద్ధాలని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కొట్టిపారేశారు.
తమ హయాంలో మంజూరైన పనులనే ఇప్పుడు కొనసాగిస్తూ, వాటికి తానే కారణమని చెప్పుకోవడం రాజకీయ లబ్ధి కోసమేనని ఆరోపించారు. మంగళవారం నగరంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేసి పూలమాల వేయడం జరిగింది.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ నిధులు ఆయన కృషి ఫలితం కాదని, అవి గత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించినవేనని స్పష్టం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.
కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా, కేసీఆర్ జీజీ కాలేజీ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో నిజామాబాద్ పట్టణ అభివృద్ధి పనులకోసం 100 కోట్ల నిధులను ప్రకటించారనీ గుర్తు చేశారు.
ఆ నిధుల మంజూరుకు సంబంధించిన జీ.ఓ కాపీ అందిన వెంటనే, అప్పటి ప్రజాప్రతినిధులు ఆర్ఆర్ చౌరస్తా నుండి పాత కలెక్టర్ గ్రౌండ్ వరకు కృతజ్ఞత ర్యాలీ నిర్వహించినట్లు గుర్తు చేశారు.”ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన 100 కోట్ల నిధులతోనే నగరంలోని 60 డివిజన్లలో దాదాపు 90 శాతం పనులకు భూమిపూజలు చేసి, శిలాఫలకాలు ఏర్పాటు చేశాం.
ఇప్పుడు ఆ పనులనే కొనసాగిస్తూ, తానే కొత్తగా నిధులు తెచ్చానని ప్రచారం చేసుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని ఘాటుగా విమర్శించారు.ప్రజల సందర్శన కోసం ఏర్పాటు చేసిన ట్యాంక్ బండ్ (బొడ్డెమ్మ చెరువు) వద్ద ఊడ్చే నాధుడు లేడని, లైట్లు కూడా పనిచేయని పరిస్థితి ఉందని అన్నారు. అభివృద్ధిలో పోటీపడి మా కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేయాలని హితవు పలికారు.
మా హయాంలో వచ్చిన నిధులను తానే తీసుకువచ్చినట్లు చేసుకుంటున్న ప్రచారాన్ని ఖండించారు.అలాగే 29 నవంబర్ 2009వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కెసిఆర్ దీక్షను భగ్నం చేయడానికి అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు.
నిరాహార దీక్షను కొనసాగించి ఈ ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమని ఏ ఇతర ప్రత్యామ్నాయాలు అవసరం లేదని చేపట్టిన దీక్షకు రోజురోజుకు క్షీణిస్తున్న కేసీఆర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల దశాబ్దాల కాల పోరాటానికి తల వంచి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నామని ప్రకటన చేసిన సందర్భంగా తెలంగాణ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా బారాస కార్యనిర్వహ అధ్యక్షుడు కేటీఆర్ పిలుపుమేరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదాన్న విఠల్ రావ్, ఎమ్మెల్సీ విజి గౌడ్, మాజీ మేయర్ నీతూ కిరణ్ శేఖర్, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బారాస నగర అధ్యక్షులు సిర్ప రాజు తదితరులు పాల్గొన్నారు.
