సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన యువత, నేరస్తులను హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని నిజామాబాద్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు.
దేశం గర్వించదగ్గ మహానుభావులను విస్మరించి, ఓ కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఫోటోను తన వాహనంపై ప్రదర్శించిన ఓ ఆటో డ్రైవర్ ఉదంతం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
ఎడపల్లి కి చెందిన ఓ ఆటో డ్రైవర్ తన వాహనం వెనుక భాగంలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తుపాకి పట్టుకుని ఉన్న ఫోటోను అతికించి రోడ్లపై చక్కర్లు కొట్టాడు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా, నేర ప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా ఉన్న ఆ చిత్రాన్ని గుర్తించిన పోలీసులు, వెంటనే సదరు ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ సదరు డ్రైవర్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ వాహనదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వాహనాలపై భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటిచెప్పిన మహానుభావులు, జాతీయ నాయకులు, స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలను మాత్రమే ప్రదర్శించాలి.
సమాజ శాంతికి విఘాతం కలిగించే గ్యాంగ్‌స్టర్లు, నేరస్తుల ఫోటోలను పెట్టుకోవడం చట్టరీత్యా నేరమే కాకుండా, యువతను తప్పుదోవ పట్టించినట్లవుతుందనీ అన్నారు.
దేశభక్తిని ప్రతిబింబించే చిత్రాలను చూసి స్ఫూర్తి పొందాలే తప్ప, హింసను ప్రేరేపించే ధోరణి మంచిది కాదు.నేరస్తులను గ్లోరిఫై (గొప్పగా చూపించడం) చేసే ఇలాంటి చర్యలను సహించేది లేదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
