ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, ఘనమైన భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్న ఓ యువకుడి కలలు కాలిబూడిదయ్యాయి. లండన్‌లో మూడు రోజుల క్రితం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిజామాబాద్ యువకుడు శ్రీకర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన ఈ యువకుడి మరణవార్త తెలియడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
శ్రీకర్ నిజామాబాద్ నగరం నుంచి లండన్‌కు వెళ్లి అక్కడ ఎంఎస్ పూర్తి చేశారు. మూడు రోజుల క్రితం ఆయన నివసిస్తున్న అద్దె ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే అభిషేక్ అనే మరో యువకుడు మృతి చెందగా, శ్రీకర్ తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ, మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన శ్రీకర్ చివరికి కన్నుమూశారు. పుట్టెడు దుఃఖంలోనూ శ్రీకర్ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలిస్తోంది.
తన కుమారుడు తిరిగి రాని లోకాలకు వెళ్లినా, మరికొందరిలో ప్రాణమై జీవించాలని భావించి అవయవదానానికి ముందుకు వచ్చారు. శ్రీకర్ అవయవాలను దానం చేసేందుకు వారు సమ్మతి తెలిపారు.
విదేశీ గడ్డపై కుమారుడిని కోల్పోయిన ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. శ్రీకర్ భౌతికకాయాన్ని త్వరితగతిన భారత్‌కు, ముఖ్యంగా నిజామాబాద్‌కు తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని వారు వేడుకుంటున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
