నగర శివార్లలోని గొల్లగుట్ట అటవీ ప్రాంతంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నాడు. మృతదేహం కుళ్లిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గొల్లగుట్ట తాండ అటవీ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు వెళ్లి చూడగా, ఒక వ్యక్తి మృతదేహం పడి ఉంది. సమాచారం అందుకున్న రూరల్ ఎస్.హెచ్.ఓ. శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండటంతో గుర్తింపు సాధ్యం కాలేదు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి వివరాలు తెలిసిన వారు,లేదా ఎవరైనా వెతుకుతున్న వారు రూరల్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని ఎస్.హెచ్.ఓ. కోరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
