నిజామాబాద్ జిల్లాలో రైతులు పండించిన మక్క (మొక్కజొన్న) పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఆయన ఒక లేఖ రాశారు.
జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి భారీగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న ఆలస్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు క్వింటాల్‌కు రూ. 2,400 కనీస మద్దతు ధర ప్రకటించిన విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో, రైతులు గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రైవేట్ మార్కెట్‌లో క్వింటాల్‌కు కేవలం రూ. 1,700 నుండి రూ. 1,800 మాత్రమే లభిస్తోందని, దీనివల్ల ప్రతి రైతు సగటున రూ. 20,000 నుండి రూ. 25,000 వరకు నష్టపోవాల్సి వస్తోందని ఆయన వివరించారు. రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించాలని ఎంపీ కోరారు.
జిల్లావ్యాప్తంగా అవసరమైన చోట్ల తక్షణమే కేంద్రాలను ప్రారంభించాలి.రైతులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలి.
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మక్క కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
