రహదారి నిబంధనలు పాటించడం అంటే మన ప్రాణాలను మనం కాపాడుకోవడమేనని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించి ప్రయాణిస్తే, జిల్లా ప్రజలందరికీ ఐపీఎల్ మ్యాచ్‌ను ఉచితంగా చూపిస్తామని ఆయన ప్రకటించడం విశేషం.
నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘మన ఊరు – మన భద్రత – మన బాధ్యత’ అనే నినాదంతో శుక్రవారం నగరంలోని శ్రీ రామ గార్డెన్స్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, సర్పంచులకు రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. “ప్రపంచంలో ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగని దేశం ఫిన్లాండ్.
మన దగ్గర కూడా అదే క్రమశిక్షణ రావాలి” అని ఆకాంక్షించారు. ముఖ్యంగా రోడ్లపై ధాన్యం ఆరబోసే క్రమంలో భద్రత కోన్లు లేదా రేడియం స్టిక్కర్లు ఉన్న బకెట్లను వాడాలని, తద్వారా వాహనదారులకు ముందస్తు సమాచారం అందుతుందని సూచించారు.
డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్‌ల బారిన పడి యువత భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనించాలని కోరారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ వాడకం ప్రాణాంతకమని, అధిక వేగం, అలసటతో వాహనాలు నడపవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సభికులను కంటతడి పెట్టించాయి.
మాక్లూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబం రోడ్డున పడింది. ఈ క్రమంలో సేకరించిన ఆర్థిక సాయాన్ని సీపీ చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యురాలు పుష్పకు అందజేశారు. ఈ సందర్భంగా అందరితో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సదస్సులో అదనపు డీసీపీ జి. బస్వా రెడ్డి, మేయర్ కూరగాయల ఉమారాణి, ఇంచార్జి ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, అలాగే సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు చిన్న సాయిరెడ్డి, వివిధ విభాగాల ఇన్స్పెక్టర్లు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
