మున్సిపల్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుల వేతనాల బకాయిల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. నెలల తరబడి జీతాలు అందక, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఒక కార్మికుడు ఏకంగా ప్రాణాలకు తెగించి నిరసనకు దిగడం నగరంలో కలకలం రేపింది.
శుక్రవారం నిజామాబాద్ నగరంలోని ఒక వాటర్ ట్యాంక్ ఎక్కిన కార్మికుడు, తన ఆవేదనను సోషల్ మీడియా వేదికగా చాటాడు. నగరంలోని జోన్-IIIలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న షేక్ హాజీ, జీతాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం నగరంలోని ఒక వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టాడు.
“వెంటనే మా బకాయి వేతనాలు చెల్లించాలి.. లేనిపక్షంలో ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటాను” అంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చీకటి పడిన తర్వాత కూడా అధికారులు ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మరో వీడియోను విడుదల చేయడం గమనార్హం.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. ట్యాంక్‌పై ఉన్న హాజీతో గంటల తరబడి చర్చలు జరిపి, ఎట్టకేలకు ఆయనను సురక్షితంగా కిందికి దించారు. అయితే, కిందికి వచ్చిన తర్వాత కూడా హాజీ తన ఆవేదనను ఆపుకోలేకపోయారు.
పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. తమ పొట్ట కొట్టవద్దని, పని చేసిన కాలానికి జీతం అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
