ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై పార్టీలకతీతంగా మండల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రం బస్టాండ్లో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.
అనంతరం బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ మల్లయ్యకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
దొడ్డు వడ్లు, సన్నం వడ్లు, మక్కలను సైతం కొనుగోలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. తేమ శాతం తక్కువగా ఉన్నప్పటికీ కాంటా వేయడం లేదని, క్వింటాలుకు కడ్తా పేరుతో 10 కిలోల వడ్లు కడ్తా విధిస్తున్నారని ఆరోపించారు.
దీంతో రైతులపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులు పండించిన ప్రతి గింజను మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేయాలని, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా స్వీకరించాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
