రోగుల పట్ల కరుణ, అంకితభావంతో సేవలు అందించే నర్సింగ్ సిబ్బంది వైద్య రంగానికి వెన్నెముక వంటి వారని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగ మోహన్ రావు కొనియాడారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్పిటల్‌తో పాటు ఎంసీహెచ్ బ్లాక్‌లో నర్సింగ్ సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
కార్యక్రమం ప్రారంభంలో నర్సింగ్ సిబ్బంది జ్యోతి ప్రజ్వలన చేసి, నర్సింగ్ వ్యవస్థకు మూలపురుషురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం వృత్తి పట్ల నిబద్ధతతో పనిచేస్తామని అందరూ కలిసి ‘నర్సింగ్ ప్రతిజ్ఞ’ చేశారు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభ సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు అహర్నిశలు సేవలందించిన నర్సుల సేవలు మరువలేనివని సూపరింటెండెంట్ గుర్తుచేశారు.
ఆపదలో ఉన్న రోగులకు చిరునవ్వుతో సేవలు అందించడమే నర్సుల అసలైన బాధ్యతని కొనియాడారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని అభినందించారు.
ఈ వేడుకల్లో హాస్పిటల్ డిప్యూటీ సూపరింటెండెంట్ డా. రవికిరణ్, ఎంసీహెచ్ విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ డా. శ్రీకాంత్, వైద్యులు డా. హరీష్ స్వామి, డా. రాజేందర్, గ్రేడ్-1 నర్సింగ్ సూపరింటెండెంట్ చంద్రకళతో పాటు పెద్ద సంఖ్యలో సిబ్బంది నర్సులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
