పంజాబ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు ప్రయాణికుడిగా కారు ఎక్కి, డ్రైవర్‌ను మాటల్లో పెట్టి బురిడీ కొట్టించిన ఓ వ్యక్తి వాహనాన్ని అపహరించుకుపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని నిజామాబాద్ టౌన్-I పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం టౌన్-I పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్‌హెచ్‌ఓ బి. రఘుపతి ఈ వివరాలను వెల్లడించారు.
నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాల నుంచి ఒక వ్యక్తి తన కారులో బయలుదేరగా, మార్గమధ్యంలో ఒక అపరిచిత వ్యక్తి ప్రయాణికుడిగా ఎక్కాడు. తాను వెళ్లాల్సిన ప్రాంతానికి తీసుకెళ్లాలని కోరడంతో డ్రైవర్ సమ్మతించాడు. కారు గాంధీచౌక్ సమీపానికి రాగానే, పండ్లు కొనుగోలు చేయాలని డ్రైవర్‌ను కారు దిగి రమ్మని నమ్మించాడు.
డ్రైవర్ పండ్లు కొనేందుకు వెళ్లిన అదను చూసి, ఆ అగంతకుడు కారును స్టార్ట్ చేసుకుని వేగంగా పరారయ్యాడు. బాధితుడు వెంటనే టౌన్-I పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కేసు తీవ్రతను గుర్తించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు.
సాంకేతిక ఆధారాలు, పక్కా సమాచారంతో నిందితుడు పంజాబ్ రాష్ట్రానికి చెందిన లఖ్విందర్ సింగ్ అని గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడి వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
