డ్రగ్స్ పరీక్షల్లో పలువురికి పాజిటివ్ గంజాయి, మత్తుపదార్థాల విక్రయాలు, వినియోగంపై ఉక్కుపాదం మోపుతామని, అలవాట్లు మార్చుకోకుండా పదేపదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ (నిర్బంధ నిరోధక చట్టం) ప్రయోగిస్తామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో మత్తుపదార్థాల నిర్మూలనే ధ్యేయంగా పోలీస్ శాఖ, ఈగల్ టీం సంయుక్తాధ్వర్యంలో శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక అవగాహన, కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగం కేసుల్లో ఉన్న నిందితులు, రౌడీషీటర్లు, అనుమానితులను ఇక్కడికి రప్పించి సీపీ స్వయంగా కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. మత్తు పదార్థాల మహమ్మారి వల్ల యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమవడమే కాకుండా, వారి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి చేటని, చట్టపరంగా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు. గతంలో కేసులు నమోదైన వారు ప్రవర్తన మార్చుకుని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా ఉంచామని, విద్యాసంస్థలు, హాస్టళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, ఉపాధిపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడైనా మత్తుపదార్థాల విక్రయాలు జరుగుతున్నట్లు తెలిస్తే ప్రజలు సామాజిక బాధ్యతగా డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. కౌన్సిలింగ్ అనంతరం ఈగల్ టీం, పోలీస్ సిబ్బంది అనుమానితులకు డ్రగ్స్ నిర్ధారణ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కొంతమందికి పాజిటివ్‌గా తేలడంతో.. వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (ఏఆర్) రాంచందర్ రావు, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈగల్ టీం డీఎస్పీ ఎం.సోమనాథం, హోంగార్డ్స్ ఏసీపీ కె.దీపక్ చంద్ర, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ రెడ్డి, నిజామాబాద్ టౌన్ సిఐ శ్రీనివాస రాజ్, సౌత్ రూరల్ సిఐ ఎన్.సురేష్ కుమార్, నార్త్ రూరల్ సీఐ బి.శ్రీనివాస్, డిచ్‌పల్లి సిఐ కె.వినోద్, ధర్పల్లి సిఐ బిక్షపతి, నిజామాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
