ప్రజా సమస్యలను తీరుస్తారని, డివిజన్ను అభివృద్ధి పథంలో నడిపిస్తారని జనం ఓట్లేసి గెలిపిస్తే.. కొందరు కార్పొరేటర్లు మాత్రం తమ పదవులను ‘కార్పొరేట్’ వ్యాపారాలుగా మార్చేసుకుంటున్నారు. నగరంలో ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న అపార్ట్మెంట్ లేపాలన్నా.. చదరపు అడుగుకు ఇంత అని ‘కార్పొరేట్’ పద్ధతిలో రేట్లు ఫిక్స్ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాల సాకుతో బెదిరింపులకు దిగడం, పర్సెంటేజీల కోసం బిల్డర్లను వేధించడం ఇప్పుడు నగరంలో బహిరంగ రహస్యంగా మారింది. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సిన నాయకులు.. కలెక్షన్ల కోసం వేటగాళ్లలా డివిజన్లలో చక్కర్లు కొడుతుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. నగరంలోని కొన్ని డివిజన్లలో కొందరు కార్పొరేటర్ల దినచర్య చాలా విచిత్రంగా సాగుతోంది.
తెల్లారకముందే డివిజన్లలో పర్యటనల పేరిట హడావిడి మొదలుపెడతారు. అయితే ఈ పర్యటనలు డ్రైనేజీ సమస్యల కోసమో, తాగునీటి ఇబ్బందుల కోసమో అనుకుంటే పొరపాటే. డివిజన్ పరిధిలో ఎక్కడెక్కడ కొత్తగా పునాదులు పడుతున్నాయి..? ఎక్కడెక్కడ లేఅవుట్లు వేస్తున్నారు..? ఎక్కడ స్లాబ్ పడుతోంది..? అనే అంశాలపైనే వీరి నిఘా నేత్రాలు కేంద్రీకృతమవుతాయి. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడమే ఆలస్యం.. వెనువెంటనే తమ మార్కు ‘వసూళ్ల’ వ్యూహానికి తెరతీస్తున్నారు.
కార్పొరేటర్ లు సైట్ను మార్క్ చేయడమే తరువాయి.. ఆయా డివిజన్ల పరిధిలోని వార్డు సిబ్బంది (టౌన్ ప్లానింగ్ లేదా లోకల్ స్టాఫ్) అక్కడ వాలిపోతారు. “ఈ నిర్మాణానికి అనుమతి లేదు.. రోడ్డుకు అడ్డంగా ఇసుక, కంకర వేశారు.. నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారు.. వెంటనే పనులు ఆపేయండి” అంటూ యజమానులను భయభ్రాంతులకు గురిచేస్తారు. బిల్డర్లు లేదా యజమానులు ఎంత బతిమాలినా వినకుండా, “మేమేం చేయలేం.. ఇదంతా పైనుంచి ఆర్డర్.. మీరేదో ఒకటి చూసుకుని ‘సార్’ (కార్పొరేటర్) దగ్గరికి వెళ్లి సెటిల్ చేసుకోండి” అంటూ అసలు రూట్ మ్యాప్ చూపిస్తారు. అనుమతులు లేవంటూ పనులు నిలిపివేయడం, కూల్చివేస్తామని హెచ్చరించడం.
పర్సెంటేజీ పద్ధతిలో లేదా లంప్సమ్గా భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేయడం. కార్పొరేటర్ క్యాంప్ ఆఫీసులో ‘మామూళ్లు’ ముట్టగానే సీన్ రివర్స్. చట్టవిరుద్ధం అన్న నోళ్లే.. అంతా సక్రమంగానే ఉందంటూ క్లీన్ చిట్ ఇవ్వడం. జీవితకాల కష్టాన్ని, రెక్కల కష్టాన్ని కూడబెట్టి సొంతంగా ఒక గూడు కట్టుకోవాలని చూస్తున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఈ ‘గల్లీ లీడర్ల’ వసూళ్ల దందా ఒక పెద్ద శాపంగా మారింది. అడిగినంత ఇచ్చుకోకుంటే పనులు సాగనివ్వమని భీష్మించుకు కూర్చుంటుండటంతో బిల్డర్లు సైతం తలలు పట్టుకుంటున్నారు.
చట్టాన్ని, నిబంధనలను తమ స్వార్థానికి, వసూళ్లకు అస్త్రాలుగా వాడుకుంటున్న కొందరు ప్రజాప్రతినిధుల తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు, నిఘా విభాగాలు తక్షణమే స్పందించి, డివిజన్లలో సాగుతున్న ఈ ‘కార్పొరేట్’ కలెక్షన్ల దందాకు అడ్డుకట్ట వేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
