ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పలు విత్తన దుకాణాలపై టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కల్తీ విత్తనాల నివారణే ధ్యేయంగా వ్యవసాయ, పోలీస్, సీడ్ సర్టిఫికేషన్ శాఖల అధికారులు సంయుక్తంగా ఈ దాడులు చేపట్టారు.సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో దుకాణాలలోని స్టాక్ రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు, విత్తన ప్యాకెట్ల లాట్ నంబర్లు, సర్టిఫికేషన్ మరియు గడువు తేదీ (వాలిడిటీ) తదితర వివరాలను అధికారులు నిశితంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏడీఏ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామన్నారు. అధిక లాభాల కోసం కల్తీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేయాలని చూస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విత్తన విక్రేతలు, రైతులు తప్పనిసరిగా కింది నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. రైతులు విత్తనాలను కేవలం లైసెన్స్ పొందిన అధికారిక డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన సమయంలో డీలర్ల నుండి తప్పనిసరిగా బిల్లు లేదా రసీదు తీసుకోవాలి.
రైతులు కొనుగోలు చేసిన విత్తన రసీదులను, బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తన డీలర్లు తమ దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు, ధరల సమాచార బోర్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ నిల్వలను నమోదు చేయాలి.
కేవలం గుర్తింపు పొందిన, నాణ్యమైన విత్తన కంపెనీల నుండి మాత్రమే విత్తనాలను సేకరించి రైతులకు అందుబాటులో ఉంచాలి.ఈ ఆకస్మిక తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి, మహేందర్ రెడ్డి, సీడ్ మేనేజర్ వినయ్, ఏఎస్ఐ గంగారాం, ఏఈఓ చక్రపాణి తదితర అధికారులు పాల్గొన్నారు.
