డ్రగ్స్ రహిత సమాజం కోసం హెచ్-న్యూ విభాగాన్ని బలోపేతం చేశామని, మాదకద్రవ్యాల విషయంలో ఎంతటివారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పేట్ల బురుజులోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. నగర ప్రజలకు అత్యాధునిక సేవలు అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అడుగులు వేస్తోందని సీపీ పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ‘సీ-మిత్ర’ వర్చువల్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను ప్రవేశపెట్టడం ద్వారా బాధితులు ఇంటి నుంచే ఫిర్యాదు చేసే అవకాశం కల్పించాం.
ఇప్పటివరకు దీని ద్వారా 1130 జీరో ఎఫ్ఐఆర్లు, సైబర్ క్రైమ్ పీఎస్‌లో 380 కేసులు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. ఏఐ కాప్‌రైటర్, సాక్-ఐ వంటి ఏఐ ఆధారిత అప్లికేషన్లతో బాధితులకు వేగవంతమైన న్యాయం, డిజిటల్ భద్రతను పటిష్టం చేశామని వివరించారు.
‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ ద్వారా 20 వేల మంది సిబ్బందికి పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించి, హెల్త్ ప్రొఫైలింగ్ పూర్తి చేశామని తెలిపారు. 14 రకాల శిక్షణ కార్యక్రమాల ద్వారా సిబ్బందికి 2.30 లక్షల గంటల పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. త్వరలో 300 మంది మహిళా సిబ్బందికి డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి, వారిని పెట్రోలింగ్, బ్లూకోట్స్ విధుల్లోకి తీసుకోనున్నామని వెల్లడించారు.
‘స్పందన – తక్షణ రక్షణ’ రెస్పాండర్ బృందాలు స్వల్ప కాలంలోనే 1000 కాల్స్‌కు స్పందించి బాధితులకు అండగా నిలిచాయని సీపీ తెలిపారు. కల్తీ పదార్థాల కట్టడికి ఏర్పాటు చేసిన ‘హెచ్-ఫాస్ట్’ విభాగం ద్వారా 95 టన్నుల కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రతి శనివారం ‘సైబర్ సింబా’ వలంటీర్ల ద్వారా క్షేత్రస్థాయిలో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు ఎం. శ్రీనివాస్, తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు డి. జోయల్ డెవిస్, ఎన్. శ్వేత, సీఏఆర్ డీసీపీ ఆర్. వెంకటేశ్వర్లుతో పాటు జోనల్, ట్రాఫిక్ డిసిపిలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
