ఒకప్పుడు గ్రీన్ సిటీగా గుర్తింపు పొంది, అవార్డులను కైవసం చేసుకున్న నిజామాబాద్ నగరం, నేడు పచ్చదనం కరువై వెలవెలబోతోంది. నగరంలోని ప్రధాన రహదారుల డివైడర్లపై నాటిన మొక్కలు నీరు లేక ఎండిపోతున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో సుమారు 20 కిలోమీటర్ల మేర డివైడర్లపై మొక్కలను నాటారు. వాటిని కాపాడేందుకు డ్రిప్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. తద్వారా నగరం ‘ది బెస్ట్ గ్రీన్ సిటీ’గా అవార్డును కూడా గెలుచుకుంది.
అయితే, ప్రస్తుతం ఆ మొక్కలు సంరక్షణ లేక ఎండిపోతున్నాయి. వేసవి కాలం రాకముందే గణేష్ బిగాల ఈ విషయాన్ని హెచ్చరించినప్పటికీ, ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని నాయకులు విమర్శించారు.
మొక్కలు ఎండిపోతుండటాన్ని చూసి చలించిపోయిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల, మాజీ మేయర్ దండు నీతుకిరణ్ శేఖర్, నాయకులు జీవన్ రెడ్డి, బాజీ రెడ్డి గోవర్ధన్, వీజీ గౌడ్ మరియు బీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. పార్టీ ఆధ్వర్యంలో బిందెలతో నీళ్లు తెచ్చి, ఎండిపోతున్న మొక్కలకు పోశారు.
కనీసం ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి, ఎండిపోతున్న చెట్లను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిర్ప రాజు, ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాశ్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, మతీన్, జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
