భద్రత, ట్రాఫిక్, సీసీ కెమెరాలు, అత్యవసర సేవలపై పోలీస్ కమిషనర్ సమీక్షవచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు–2027 సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు.
పుష్కరాల ఏర్పాట్లపై బుధవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్ సౌకర్యాలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.
భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, క్యూ లైన్లు, బ్యారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.
పుష్కర ఘాట్లు, పార్కింగ్ ప్రదేశాలు, ప్రధాన కూడళ్లు, రహదారుల్లో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని, అవసరమైన చోట డ్రోన్లతో నిఘా నిర్వహించాలని సూచించారు.
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలు గుర్తించి, అక్కడి నుంచి షటిల్ వాహనాల ద్వారా భక్తులను తరలించేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, లైటింగ్, అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే పుకార్లు, తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ ఏసీపీలు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు, గోదావరి పరివాహక ప్రాంత సీఐలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్, కమ్యూనికేషన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
