మాతాశిశు ఆసుపత్రి నుంచి అపహరణ.. చాక్లెట్ ఆశ చూపించి ఎత్తుకెళ్లిన దంపతులుసంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో ఆచూకీ.. బాలుడిని సురక్షితంగా రక్షించిన పోలీసులునిందితులుగా భార్యాభర్తలు సుజాత, యెల్లం అదుపులోకినిజామాబాద్ మాతాశిశు ఆసుపత్రి నుంచి అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాంష్ కథ 24 గంటల్లోనే సుఖాంతమైంది.
చాక్లెట్ ఆశ చూపించి బాలుడిని మాయమాటలతో వెంట తీసుకెళ్లిన భార్యాభర్తలను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో సాగించిన ముమ్మర దర్యాప్తులో సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో బాలుడి ఆచూకీని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ మేరకు ఆదివారం ఒకటవటంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో తన అన్నతో కలిసి ఆడుకుంటున్న వేదాంష్‌ను నిజాంపేట్‌కు చెందిన కోతాడి సుజాత, ఆమె భర్త యెల్లం చాక్లెట్ ఆశ చూపించి తీసుకెళ్లారు.
బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా టౌన్-1, సీసీఎస్, క్రైమ్, టెక్నికల్ బృందాలు రంగంలోకి దిగాయి.వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు.
ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో బాలుడి ఆచూకీ లభించింది. సంగారెడ్డి పోలీసుల సహకారంతో అక్కడికి చేరుకున్న నిజామాబాద్ పోలీసులు బాలుడిని సురక్షితంగా రక్షించి, నిందితులైన భార్యాభర్తలను అదుపులోకి తీసుకున్నారు.
బాలుడిని విక్రయించేందుకు పన్నాగం పన్నినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ కేస్ చేదించడంలో సిసిఎస్ ఏసిపి శ్రీశైలం ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ రఘుపతి సాయినాథ్ అజయ్ ఎస్సై శ్రీనివాస్ సిబ్బందిని కమిషనర్ అభినందించారు.
