ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ కల్పించేందుకు అటవీ శాఖ సరికొత్త ప్రయత్నం చేపట్టింది. నిజామాబాద్ జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో, నిజామాబాద్ నార్త్ రేంజ్ సిబ్బంది సంయుక్తంగా సరగాపూర్ అర్బన్ పార్కులో ‘వనదర్శిని’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పి.ఎం. శ్రీ కేంద్రీయ విద్యాలయం, మల్లారం జెడ్.పి.హెచ్.ఎస్. పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అడవుల ప్రాముఖ్యత, పర్యావరణ సమతుల్యతలో వృక్ష సంపద పాత్ర, వన్యప్రాణుల సంరక్షణ గురించి అధికారులు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో వివరించారు.
అడవుల నిర్వహణ, మొక్కల పెంపకం వంటి అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు అధికారులు ఓపికగా సమాధానాలిచ్చారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు.
ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం సరగాపూర్ అర్బన్ పార్కులో ప్రత్యేకంగా ‘ప్లాస్టిక్ తొలగింపు’ కార్యక్రమాన్ని చేపట్టారు.
పార్కు ఆవరణలో ఉన్న మొక్కలకు నీరు పోసి, పచ్చదనం పట్ల తమకున్న బాధ్యతను చాటుకున్నారు. భవిష్యత్ తరాలకు అడవులను అందించడమే ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
