తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదులకు ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇచ్చి సంక్షేమ చర్యలు చేపట్టాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని కోరింది.
ఈ మేరకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్. సుభాష్ రెడ్డి వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయవాదులు విద్యార్థులు, ఉద్యమ నాయకులు, సామాన్యులపై నమోదైన కేసుల్లో ఉచితంగా న్యాయ సహాయం అందించడంతో పాటు బెయిల్లు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో కోర్టుల బహిష్కరణ, సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సడక్ బంద్, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో న్యాయవాదులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కోసం వేలాది మంది న్యాయవాదులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు నిర్వహించి, పార్లమెంట్ ముట్టడిలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.
నెలల తరబడి కోర్టులను బహిష్కరించడం వల్ల న్యాయవాదులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా దిగువ మధ్యతరగతి మరియు మహిళా న్యాయవాదుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా న్యాయవాదుల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్లో ప్రతి ఏడాది రూ.500 కోట్లు కేటాయించడం, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాల్లో ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యం కల్పించడం, ఉద్యమ న్యాయవాదులను అధికారికంగా గుర్తించి సన్మానించడం, రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సత్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి ఆచార్య, బిర్లా రామారావు, ఆశ నారాయణ, పులి జైపాల్,పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
