మండలంలోని పోచంపాడ్ వద్ద ఉన్న అమ్రై కాలనీలో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కాలనీలోని కొన్ని ఇండ్లు పూర్తిగా తడిసి కూలిపోయే ప్రమాదం ఉందని సమాచారం అందడంతో మెండోరా ఎస్సై సుహాసిని వెంటనే స్పందించారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్సై సుహాసిని ప్రజలకు పలు సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని, కాలయాపన కోసం ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
పిల్లలను కరెంటు స్తంభాల వద్ద, విద్యుత్ తీగల సమీపంలో, చెరువులు, కుంటలు, కాలువలు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఆడనివ్వవద్దని, వారిపై తల్లిదండ్రులు నిరంతరం నిఘా ఉంచాలని కోరారు.
భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఎస్సై సుహాసిని విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే తమ మొదటి ప్రాధాన్యమని ఆమె పేర్కొన్నారు.
