ఆషాఢమాసంలో నిర్వహించే ఇందూరు ఊరపండుగ ఈసారి అపూర్వ భక్తిశ్రద్ధల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. “పులోరియా.. పులోరియా..” అంటూ మారుమోగిన భక్తుల నినాదాలు, డప్పుల దరువులు, పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలతో ఇందూరు నగరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది.
సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుతూ నిజామాబాద్ ప్రజలు దశాబ్దాలుగా ఈ ఊరపండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.వేలాది మంది భక్తులు పాల్గొని గ్రామదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ ఊరపండుగ నిర్వహణ కమిటీ సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఖిల్లా రఘునాథ ఆలయం సమీపంలోని తేలుమైసమ్మ (శారదాంబ) గద్దె వద్ద గ్రామదేవతలను పసుపు, కుంకుమ, పూలు, ఆభరణాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మామిడి కర్రలతో రూపొందించిన గ్రామదేవతల కొత్త విగ్రహాలను అర్ధరాత్రి ఖిల్లాలో ప్రతిష్ఠించారు.
ఆనవాయితీ ప్రకారం మూడు రోజుల ముందే బాసర గోదావరి నుంచి పవిత్ర జలాలను తీసుకొచ్చి గ్రామదేవతలకు జలాభిషేకం చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఖిల్లా రఘునాథ ఆలయం నుంచి గ్రామదేవతల ఊరేగింపు ప్రారంభం కాగానే వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
తొట్టెల కింద భక్తులు వరుసగా కూర్చోగా, వారి మీదుగా తొట్టెలను తీసుకెళ్లే సంప్రదాయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పుల మోతలు, పోతరాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, మహిళల భక్తి పారవశ్యం మధ్య దేవతామూర్తుల ఊరేగింపు గాజుల్పేట్, పెద్దబజార్ చౌరస్తాల మీదుగా వైభవంగా సాగింది.
అయితే పెద్దబజార్ చౌరస్తా వద్ద నుంచి ఊరేగింపు రెండు బృందాలుగా విడిపోయింది. ఒక బృందం పౌడాలమ్మ, నల్లపోచమ్మ, అడెల్లి పోచమ్మ, పెద్దమ్మ దేవతామూర్తులతో దుబ్బ ప్రాంతం వైపు వెళ్లగా, మరో బృందం సిర్నాపల్లిగడి, గోల్ హనుమాన్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్ ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, మహాలక్ష్మమ్మ దేవతామూర్తులతో ఊరేగింది.
అనంతరం ఆయా ప్రాంతాల ఆలయాల్లో దేవతామూర్తులను ప్రతిష్ఠించారు.ఈ ఊరపండుగలో ప్రధాన ఘట్టమైన సరినిని నాలుగు గుల్లలుగా విభజించి దుబ్బ, వినాయక్‌నగర్, ఎల్లమ్మగుట్ట, కంఠేశ్వర్ ప్రాంతాల ప్రజలు తమ ఇళ్లు, పొలాల్లో చల్లుకున్నారు.
వర్షాలు సమృద్ధిగా కురవాలని, వ్యాధులు, అరిష్టాలు దరిచేరకుండా ఉండాలని గ్రామదేవతలను వేడుకుంటూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.అమ్మవారిని దర్శించుకున్న ప్రజాప్రతినిధులుఊరపండుగ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ కూరగాయల ఉమారాణి,కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. కాంగ్రెస్ నాయకులు కేశవేణు, నరాల రత్నాకర్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, నగరవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
