ఊరపండుగ నిజామాబాద్ నగరంలో ఆదివారం నిర్వహించిన సంప్రదాయ ఇందూరు ఊరపండుగ భక్తి పారవశ్యం, ఆధ్యాత్మిక శోభ మధ్య ప్రశాంతంగా ముగిసింది. వేలాది మంది భక్తులు గ్రామదేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, అధికార యంత్రాంగం సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించారు.ఖిల్లా రఘునాథ ఆలయం సమీపంలోని శారదాంబ (తేలుమైసమ్మ) గద్దె నుంచి 12 గ్రామదేవతల విగ్రహాలను సంప్రదాయం ప్రకారం నగరంలోని 14 ప్రాంతాలకు శోభాయాత్రగా తీసుకెళ్లి ప్రతిష్ఠించారు.
శోభాయాత్రలో ప్రధాన కూడళ్ల వద్ద భక్తులు ఆనవాయితీ ప్రకారం యాటాపోతులు, కోడికుంజులను బలిగా సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. డప్పు సప్పుల మోతలు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, “పులోరియా.. పులోరియా..” అంటూ మారుమోగిన భక్తుల నినాదాలతో నగరం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది.
వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలంతా సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని, అంటువ్యాధులు, అరిష్టాలు దరిచేరకూడదని గ్రామదేవతలను వేడుకుంటూ భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ప్రజల సహకారం, అధికారుల అప్రమత్తతతో ఇందూరు ఊరపండుగ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా ముగిసింది.
