దేవాదాయ శాఖ పరిధిలో అధికార పార్టీ నేతల పదవి సంబరం పూర్తీ అయింది. ప్రముఖ దేవాలయాల పాలక మండళ్ల చైర్మన్ల పదవీకాలం ముగిసింది. ఈ మేరకు ఎండోమెంట్స్ శాఖ ఆయా చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది. దీనితో ఆయా ఛైర్మెన్ లు బాధ్యతలనుంచి తప్పుకున్నారు.
తమ పదవి కాలం ఏడాది లోపే పూర్తీ కావడంతో ఛైర్మెన్ లుగా పనిచేసిన వారంతా అసంతృప్తి గా నే వైదొలిగారు. తమకు మరోసారి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
గతంలో తమకు పదవి కట్టబెట్టిన నేతల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు వీరికే పదవి కాలం పొడిగిస్తారా? లేదంటే కొత్తవారికి అవకాశం ఇస్తారా ?అనేది అధికార పార్టీ నేతలకు ఆసక్తిగా మారింది. వీరిలో ఒకరిద్దరికి మాత్రమే పదవి కాలం పొడిగిస్తారని చెప్తున్నారు.
పదేళ్ల తరవాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం నామినేటెడ్ పదవుల కింద జిల్లాలోని పలు దేవాలయాలకు పాలక మండళ్ల చైర్మన్లను నియమించింది. ఇందులో జెండా బాలాజీ ఆలయానికి లవంగం ప్రమోద్‌కుమార్, శంభుని గుడికి మధు, హమాల్వాడి సాయిబాబా ఆలయానికి గంగ కిషన్, కంటేశ్వర్ నీలకంఠేశ్వర ఆలయానికి తిరుపతిని చైర్మన్లుగా నియమించారు.
వీరి ఏడాది పదవీకాలం పూర్తికావడంతో ప్రభుత్వం పదవులను ముగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రభుత్వం పదవీకాలాన్ని పొడిగించకుండా ఉత్తర్వులు ఇవ్వడం అధికార పార్టీ నాయకుల్లో చర్చకు దారితీసింది.
పదవీకాలం పూర్తైన చైర్మన్లకు ఎండోమెంట్స్ శాఖ అధికారికంగా నోటీసులు అందజేయడంతో ప్రస్తుతం ఆయా దేవాలయాల పాలక మండళ్ల చైర్మన్ పోస్టులు ఖాళీగా మారాయి. కొత్త నియామకాలపై మాత్రం ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే పదవీకాలాన్ని మరోసారి పొడిగిస్తారని, పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నాయకులకు మరో అవకాశం లభిస్తుందని ఆశించిన నాయకులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది.
పదవుల పొడిగింపు లేకుండానే గడువు ముగిసినట్లు ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. దీంతో తదుపరి ఎవరికి అవకాశం దక్కనుందనే అంశంపై నాయకుల్లో ఆసక్తి నెలకొంది.
పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన నాయకులకు ఈసారి అవకాశం దక్కుతుందా? లేక ప్రస్తుత చైర్మన్లలో కొందరినే మళ్లీ నియమిస్తారా..? అనే చర్చ అధికార పార్టీలో సాగుతోంది. ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై ఆశావహ నాయకులు ఎదురుచూస్తున్నారు.
