తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాఢ మాసం బోనాల వేడుకలు పాత కలెక్టరేట్ ప్రాంగణంలో టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల మహోత్సవాల్లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకల్లో భాగంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత ముందుకుపోవాలని మనసారా ప్రార్థించారు.
ఈ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కూడా ఉత్సాహంగా పాల్గొని, భక్తులతో కలిసి బోనాల సంబరాల్లో సందడి చేశారు.
అమ్మవారికి సమర్పించే బోనాలతో మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొనగా, వేడుక ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.
బలోపేతమైన ఐక్యత: మహేష్ కుమార్ గౌడ్ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. బోనాల పండుగ మన రాష్ట్ర అస్తిత్వానికి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు సమాజంలో ఐక్యతను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు కేశ వేణు, శేఖర్ గౌడ్, రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, దయాకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఎన్జీఓఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
