అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ ఏఐ ఆధారిత నెక్స్ట్ జనరేషన్ డయల్–112 వ్యవస్థను ప్రారంభించింది. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో డీజీపీ సి.వి. ఆనంద్ ఈ సేవలను ప్రారంభించారు.
ఈ వ్యవస్థ ద్వారా పోలీసు, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, విపత్తు నిర్వహణ సేవలు ఒకే నంబర్ 112 ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఏఐ సాంకేతికతతో స్పామ్, సైలెంట్ కాల్స్‌ను ఫిల్టర్ చేసి అత్యవసర కాల్స్‌కు వెంటనే స్పందించేలా రూపొందించారు.
కాల్ ప్రాసెసింగ్ సమయం 190 సెకన్ల నుంచి 133 సెకన్లకు తగ్గగా, రాష్ట్ర సగటు స్పందన సమయం 10 నిమిషాల 30 సెకన్లుగా నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే మెరుగైనదని అధికారులు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా 1,860 పెట్రోలింగ్ వాహనాలను ఈ వ్యవస్థతో అనుసంధానించారు.
ఘటనాస్థలానికి సమీపంలోని వాహనాన్ని ఆటోమేటిక్‌గా గుర్తించి పంపించే సదుపాయం కల్పించారు. భవిష్యత్తులో హైదరాబాద్ సహా నాలుగు కమిషనరేట్లలో డ్రోన్లను ‘ఏరియల్ ఫస్ట్ రెస్పాండర్స్’గా వినియోగించనున్నట్లు వెల్లడించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకే నంబర్ ‘112’ను వినియోగించాలని డీజీపీ సి.వి. ఆనంద్ విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో డీజీపీ సి.వి. ఆనంద్తో పాటు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, TGCSB & FSL డైరెక్టర్ శిఖా గోయల్, డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి. శ్రీనివాసరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, TGiCCC డైరెక్టర్ వి.బి. కమలాసన్ రెడ్డి, సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్, మల్కాజిగిరి సీపీ బి. సుమతి, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్, సీఐడీ డీజీ చారూ సిన్హా, పి&ఎల్ ఐజీపీ గజరావ్ భూపాల్, టిజి టిఎస్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, మల్టీ జోన్–1 ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
