బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. బుధవారం కోటగిరి పోలీస్ స్టేషన్లో బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, పేకాట, గుట్కా తదితర కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరిత న్యాయం అందించాలని పేర్కొన్నారు.రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్పై విడుదలైన వారిపై నిరంతరం నిఘా ఉంచాలని, రాత్రి పహారా వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు.
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి బ్లాక్ స్పాట్ల వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
రోడ్లకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించడంతో పాటు ఇంజినీరింగ్ లోపాలను గుర్తించి నేషనల్, స్టేట్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్లు చేపట్టాలని తెలిపారు. ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని అన్నారు. సోషల్ మీడియాలో అసత్య, రెచ్చగొట్టే ప్రచారాలపై నిఘా ఉంచి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
డయల్-112 సేవలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.రాబోయే పండుగల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను పటిష్టం చేయాలని, వాహనాల తనిఖీలను 24 గంటలూ కొనసాగించాలని తెలిపారు. తనిఖీల సమయంలో సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు.
పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. సీసీ కెమెరాల వినియోగాన్ని విస్తరించి సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
