తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి విక్రయానికి పాల్పడుతున్న వ్యక్తిని కోటగిరి పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 8.86 కిలోల గంజాయితో పాటు వివో మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనలో నలుగురిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో గంజాయి తరలిస్తున్న వ్యక్తి పోతంగల్ మంజీరా నది మొదటి వంతెన వద్దకు వస్తున్నాడన్న సమాచారంతో కోటగిరి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో సంచితో అనుమానాస్పదంగా నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని గుర్తించారు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకుని అతని వద్ద ఉన్న సంచిని తనిఖీ చేశారు. అందులో ప్లాస్టిక్ కవర్లలో 8.86 కిలోల గంజాయి లభించింది.
పట్టుబడిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా పెద్దకోడపగల్ మండలం పోచారం తండాకు చెందిన బర్దల్ పాచిరంగా గుర్తించారు. ఇల్లు నిర్మించడంతో అప్పులు పెరగడంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో గంజాయి విక్రయానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.
పాచిరానికి రాందాస్ పరిచయం కాగా, అతని ద్వారా ఒడిశాకు చెందిన చోటుతో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. మూడు నెలల క్రితం చోటును గంజాయి కావాలని అడగగా.. సుమారు 75 రోజుల క్రితం కామారెడ్డికి 10 కిలోల గంజాయి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. అందులో కొంత మొత్తాన్ని దేగ్లూర్కు చెందిన సాథికి విక్రయించేందుకు పోతంగల్కు వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.
ఈ కేసులో రాందాస్, సాథి, గంజాయి సరఫరా చేసిన చోటు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 8.86 కిలోల గంజాయి విలువ సుమారు రూ.44,300 ఉంటుందని పోలీసులు తెలిపారు.
కేసు దర్యాప్తులో సహకరించిన ఏసీపీ సీసీఎస్ శ్రీశైలం, ఏసీపీ బోధన్ పి. శ్రీనివాస్, రుద్రూరు సీఐ కృష్ణ, కోటగిరి ఎస్ఐ శ్రీనివాస్, రుద్రూరు ఎస్ఐ మనోజ్, సీసీఎస్ ఎస్ఐ శ్రీనివాస్, ఈగల్ టీం, చీతా ఫోర్స్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.
