అక్రమంగా తరలిస్తున్న 39.849 కిలోల గంజాయిని వర్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఏడుగురిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేయగా, ఒకరిని అరెస్టు చేశారు. మరో ఆరుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో వర్ని పోలీసులు మల్లారం తండా సబ్‌స్టేషన్ సమీపంలోని నసురుల్లాబాద్–వర్ని రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో మూడు ద్విచక్రవాహనాలపై అనుమానాస్పదంగా వస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ముందున్న ద్విచక్రవాహనం అదుపుతప్పింది. దానిపై ఉన్న వ్యక్తి గంజాయి మూటను వదిలి వెనుక వస్తున్న మరో వ్యక్తితో కలిసి పరారయ్యాడు.
ముందున్న వాహనాన్ని తనిఖీ చేయగా ప్లాస్టిక్ కవర్లలో 39.849 కిలోల గంజాయి లభించింది. వాహనంతో పాటు వివో సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తిని విచారించగా కామారెడ్డి జిల్లా పెద్దకోడపగల్ మండలం పోచారం తండాకు చెందిన బర్దవల్ గోబ్రియా (26)గా గుర్తించారు.
గోబ్రియా తన స్నేహితులు చంద్రభాను, రాజులతో కలిసి గంజాయిని కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. పెద్ద మొత్తంలో గంజాయి విక్రయించేందుకు మథుర్‌సింగ్, మథుర్ మోహన్‌సింగ్‌ల వద్ద 20 కిలోలు, సబలే నారాయణ వద్ద 10 కిలోలు, రామ్‌సింగ్ వద్ద 10 కిలోలు.. మొత్తం 40 కిలోల గంజాయిని రూ.2 లక్షలకు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
దాన్ని బడాపహాడ్ ప్రాంతంలో విక్రయించేందుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో చంద్రభాను, రాజుతో పాటు గంజాయి సరఫరా చేసిన మథుర్‌సింగ్, మథుర్ మోహన్‌సింగ్, సబలే నారాయణ, రామ్‌సింగ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వారిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1,99,245 ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో సహకరించిన పోలీసు అధికారులను, ఈగల్ టీం, చీతా ఫోర్స్ సిబ్బందిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.
నిషేధిత మాదకద్రవ్యాలను విక్రయించినా, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
