నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్యకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ సంస్థలు ఎంపిక చేసిన దేశంలోని టాప్-100 పోలీస్ చీఫ్స్ జాబితాలో ఆయనకు చోటు దక్కింది. ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలకు చేరువగా పోలీసింగ్ అందించడంలో చూపుతున్న ప్రత్యేక చొరవకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సాయి చైతన్య జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ పలు చర్యలు చేపడుతున్నారు. నేరాల నియంత్రణ, మహిళలు–బాలల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన, ప్రజల సమస్యలకు వేగంగా స్పందించేలా పోలీసింగ్‌ను మరింత ప్రజలకు చేరువ చేయడంపై దృష్టి సారిస్తున్నారు.
విధి నిర్వహణలో అంకితభావం, నిజాయితీ, సమర్థవంతమైన నాయకత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం పట్ల నిజామాబాద్ జిల్లా పోలీస్ వర్గాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ సీపీగా పనిచేస్తున్న అధికారికి దేశంలోని టాప్-100 పోలీస్ చీఫ్స్‌లో చోటు దక్కడం జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణమని పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్యకు పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల వారు అభినందనలు తెలిపారు. ప్రజల భద్రత కోసం మరింత సమర్థవంతంగా పనిచేస్తూ భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత గుర్తింపులు అందుకోవాలని ఆకాంక్షించారు.
