HomePOLITICAL NEWSUncategorizedజీవిత ఖైదీలైనా.. భవిష్యత్తుపై ఆశలుజైలు గోడల మధ్యే చదువుకు శ్రీకారంఓపెన్‌ స్కూల్‌లో 15 మంది ఖైదీలు...

జీవిత ఖైదీలైనా.. భవిష్యత్తుపై ఆశలుజైలు గోడల మధ్యే చదువుకు శ్రీకారంఓపెన్‌ స్కూల్‌లో 15 మంది ఖైదీలు ఉత్తీర్ణత

జీవిత ఖైదు అనుభవిస్తున్నా.. భవిష్యత్తుపై ఆశలు వదులుకోలేదు. నేరం చేసి శిక్ష పడిన ఖైదీలే అయినా.. మిగిలిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో చదువుపై దృష్టి సారించారు. కనీసం ప్రాథమిక విద్య కూడా పూర్తిచేయని వారు సైతం పదో తరగతి చదవాలన్న సంకల్పంతో ముందడుగు వేశారు.

తెలంగాణ జైళ్ల శాఖ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జైలు గోడల మధ్యే విద్యాభ్యాసం సాగించారు. తాజాగా వెలువడిన పదో తరగతి ఫలితాల్లో నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలుకు చెందిన 15 మంది ఖైదీలు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో శిక్ష పడినవారే ఎక్కువగా ఉండగా.. అందులోనూ హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నవారే అధికం.

ఉత్తీర్ణులైన 15 మందిలో సుమారు 8–9 మంది జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నవారే కావడం గమనార్హం. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ (ఎన్‌ఐఓఎస్‌) ద్వారా పదో తరగతి పరీక్షలు నిర్వహించారు.

నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలు నుంచి మొత్తం 16 మంది ఖైదీలు పరీక్షలకు నమోదు చేసుకోగా.. 15 మంది ఉత్తీర్ణులై 94 శాతం ఫలితాన్ని సాధించారు. ఒకేసారి 15 మంది ఖైదీలు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదో తరగతి ఉత్తీర్ణులు కావడం నిజామాబాద్‌ జైలు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది.

వీరిలో ముగ్గురు కరీంనగర్‌ జైలు నుంచి కేవలం పదో తరగతి విద్యాభ్యాసం కోసమే నిజామాబాద్‌కు రావడం విశేషం. జీవిత ఖైదు పడిందంటే ఇక జీవితమే లేదన్న వైరాగ్యంతో చాలామంది నిరాశకు గురవుతారు. అయితే ఈ ఖైదీలు అందుకు భిన్నంగా ఆలోచించారు. క్షణికావేశంలో చేసిన నేరం తమ జీవితాలను మార్చివేసినా.. మిగిలిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో చదువుపై దృష్టి సారించారు.

జైలు శిక్షను అనుభవిస్తూనే విద్యను అభ్యసించి తమలో కొత్త ఆశలు చిగురింపజేసుకున్నారు. వీరందరికీ మే నెలలో ఎన్‌ఐఓఎస్‌ ద్వారా తరగతులు ప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు నాగరాజు, గంగాధర్‌, సరిత, శివకుమార్‌ జైలు ఆవరణలోనే ఖైదీలకు ప్రత్యేకంగా బోధించారు. తెలుగు, ఇంగ్లిష్‌, డేటా ఎంట్రీ ఆపరేషన్‌, పెయింటింగ్‌, హోమ్‌ సైన్స్‌ తదితర అంశాల్లో శిక్షణ అందించారు.

ఖైదీలు విద్యను అభ్యసించినప్పటికీ పరీక్షల సమయంలో భద్రత, రవాణాపరంగా ఇబ్బందులు ఎదురయ్యేవి. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఖైదీలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జైలు ఆవరణలోనే ప్రత్యేక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు.

దీంతో ఖైదీలు జైలు నుంచే పరీక్షలు రాసే అవకాశం లభించింది. ఖైదీల విద్యాభ్యాసాన్ని ప్రోత్సహించే ఈ నిర్ణయం జైలు సంస్కరణల్లో కీలక అడుగుగా నిలిచింది. పదో తరగతిలో ఉత్తీర్ణులైన ఖైదీలను హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ జైళ్ల శాఖ డీజీ డాక్టర్‌ సౌమ్య మిశ్రా అభినందించారు.

అనంతరం వారికి మార్కుల మెమోలను అందజేశారు. శిక్ష అనుభవిస్తున్నప్పటికీ చదువును కొనసాగించి పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన ఖైదీల్లో విద్యపై ఆసక్తిని మరింత పెంచేలా జైళ్ల శాఖ చర్యలు చేపడుతోంది.ఖైదీల్లో మానసిక పరివర్తనే లక్ష్యం..

జైలు సూపరింటెండెంట్‌ అశోక్‌.. జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మానసిక పరివర్తన తీసుకురావడమే జైళ్ల శాఖ ముఖ్య ఉద్దేశం అని జైలు సూపరింటెండెంట్‌ అశోక్‌ అన్నారు.ఎన్‌ఐఓఎస్‌ ద్వారా అందిస్తున్న డేటా ఎంట్రీ, పెయింటింగ్‌ వంటి వృత్తి విద్యా కోర్సులు ఖైదీలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

శిక్ష పూర్తయ్యాక విడుదలైన వారు సమాజంలో సొంతంగా ఉపాధి పొందుతూ గౌరవంగా జీవించేందుకు ఇవి దోహదపడతాయి. ఈసారి శిక్షణ పొంది పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారంతా 60 శాతానికిపైగా మార్కులు సాధించడం విశేషం. అధ్యాపకుల అంకితభావం, జైలు సిబ్బంది నిరంతర పర్యవేక్షణతోనే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments